Kaizer News

Karimnagar CP Gouse Alam | విద్యార్థులు లక్ష్య సాధ

Karimnagar CP Gouse Alam | విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి.. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

· State - Telangana · ntnews.com

శంకరపట్నం, సెప్టెంబర్ 18 : విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణ, పట్టుదలతో దానిని సాధించేందుకు కృషి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ‘పోలీసులు మీకోసం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను సీపీ అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విద్యార్థికి గోల్ కార్డు రూపొందించి ఫొటో ఫ్రేమ్‌ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఆర్మీలో పనిచేయడంతో చిన్ననాటి నుంచే యూనిఫాం సర్వీస్‌పై ఆసక్తి ఏర్పడిందని, అదే లక్ష్యంగా కష్టపడి 25 ఏళ్ల వయసులో ఐపీఎస్ సాధించానని తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడం ముఖ్యమన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి మత్తు పదార్థాలకు అలవాటు పడితే విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుందని సీపీ హెచ్చరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ చదువుతోపాటు క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన డ్రగ్స్ వ్యతిరేక స్కిట్ ఆకట్టుకుంది. సీసీ కెమెరాల ప్రారంభం మెట్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను సీపీ ప్రారంభించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులకు హెల్మెట్లు, విద్యార్థులకు వాలీబాల్, క్యారమ్ బోర్డులు, ఇతర క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. గణే ష్ మండపాల పరిశీలన కేశవపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు గణేష్ మండపాలను సీపీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల వద్ద ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా విద్యుత్ తీగలు, నీటి వనరులు, ట్రాఫిక్ తదితర అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మండపాల వద్ద నిర్వహిస్తున్న పాయింట్ బుక్‌లను తనిఖీ చేసి పోలీస్ సిబ్బంది విధులు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, ఎస్సై శేఖర్ రెడ్డి, పోలీసు అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News