కోడూరు, ఆంధ్రప్రభ : పర్యాటక ప్రాధాన్యత కలిగిన సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు అన్నారు. శనివారం కోడూరు మండల పరిధిలోని పాలకాయతిప్ప సముద్ర తీరంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులతో కలిసి బీచ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పరిసరాల పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, పౌరులందరూ భాగస్వాములైనప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. సముద్ర తీరాలు పరిశుభ్రంగా ఉంటేనే పర్యాటకం అభివృద్ధి చెంది, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ద్వారా బాధ్యతాయుతమైన భావన పెంపొందుతుందన్నారు. నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని విక్కుర్తి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు