కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటున్న రైతులు పంట నష్టంపై పరిహారం చెల్లించాలని డిమాండ్ గద్వాల, ఆంధ్రప్రభ: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కొండపల్లి గ్రామ శివారులో నెట్టెంపాడు ప్రాజెక్టు ఫేస్–1 పరిధిలోని 99వ ప్యాకేజీ కాలువ సోమవారం ఉదయం తెగిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో కాలువకు గండి పడటంతో నీరు సమీపంలోని పంట పొలాల్లోకి చేరింది. దీంతో పలువురు రైతుల పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పనులు పూర్తిస్థాయిలో పూర్తి కాకుండానే నీటిని విడుదల చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే కాలువ తెగిందని రైతులు పేర్కొంటున్నారు. పొలాల్లోకి చేరిన నీటితో పంటలు దెబ్బతిన్నాయని, సంబంధిత అధికారులు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి కాలువకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. నష్టం జరిగిన పంటలను అంచనా వేసి బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు