Kaizer News

Nirmal: మహిళా పారిశ్రామికవేత్తలకు వరం ‘ర్యాంప్‌’..

Nirmal: మహిళా పారిశ్రామికవేత్తలకు వరం ‘ర్యాంప్‌’.. నిర్మల్‌లో అవగాహన సదస్సు!

· State - Telangana · hmtvlive.com

Nirmal: మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించి ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీవో విజయలక్ష్మి సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునేందుకు ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’ చక్కటి అవకాశమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ ఆధ్వర్యంలోని వి-హబ్‌ సౌజన్యంతో జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తల కు శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ బ్యాంకు, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త సహకారంతో ‘ర్యాంప్‌’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సూక్ష్మ, చిన్న తరహా వ్యాపార సంస్థలను మరింత వేగంగా అభివృద్ధి చేయడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పథకం కింద ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు రెండేళ్లపాటు ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం, అవసరమైన సహకారం అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. జౌళి, ఆహార శుద్ధి, తయారీ, చేతివృత్తులు, హస్తకళలు తదితర రంగాల్లోని వ్యాపార సంస్థలకు ప్రోత్సాహం కల్పిస్తారన్నారు. వ్యాపార నిర్వహణ నైపుణ్యాల పెంపు, ఉత్పత్తుల నాణ్యత మెరుగుదల, కొత్త ఉత్పత్తుల రూపకల్పన, ఉత్పత్తుల వైవిధ్యీకరణ, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌లో అవసరమైన సహకారం అందిస్తారని వివరించారు. బ్యాంకుల ద్వారా రుణ అనుసంధానం కల్పించడంతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వ్యక్తిగత మెంటరింగ్‌ అందించి వ్యాపారాలను మరింత లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటునందిస్తారని తెలిపారు. సదస్సులో ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’కు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, శిక్షణ, ప్రయోజనాలు, వ్యాపార విస్తరణకు అందించే సహకారంపై మహిళలకు అధికారులు అవగాహన కల్పించారు. వ్యాపారాలను విస్తరించేందుకు ఆసక్తి చూపిన పలువురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం మారుతి, వి-హబ్‌ డైరెక్టర్‌ జాహిద్‌‌ షేక్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌ ఊహ, ప్రతినిధులు డాక్టర్‌ డెబోశ్రీ, రూపానంద్‌, హరిచందన, స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News