ఉద్యోగుల సమస్యలపై సమగ్ర చర్చ ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ కార్యాచరణ విజయవాడ, ఆంధ్రప్రభ : ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, పీఆర్సీ, డీఏలు, ఇతర ఆర్థిక డిమాండ్లపై చర్చించేందుకు ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని సెప్టెంబరు 5న విజయవాడ ఎన్జీవో హోంలో నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కేఎస్‌ఎస్ ప్రసాద్ తెలిపారు. నూతన కమిటీల సభ్యుల పరిచయం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2025, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఇతర ఆర్థిక బకాయిల విషయంలో ఇప్పటికే జాప్యం జరిగిందని విద్యాసాగర్ అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం–ఉద్యోగ సంఘాల మధ్య ప్రస్తుతం సానుకూల వాతావరణం కొనసాగుతోందని, చర్చల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైతే ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగ సంఘాల ప్రతినిధులను త్వరలో ఆహ్వానించి పెండింగ్ సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే రూ.2 వేల కోట్ల బకాయిల చెల్లింపు, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాల చెల్లింపు, 11 వేల మంది ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపు, 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి నిర్ణయాలు తీసుకున్నారని విద్యాసాగర్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలల్లో పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు. అయితే పీఆర్సీ, డీఏలు, ఇతర ఆర్థిక అంశాల్లోనూ ప్రభుత్వం ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని విద్యాసాగర్ అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోతే సెప్టెంబరు 5న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తదుపరి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని విద్యాసాగర్ స్పష్టం చేశారు