హైదరాబాద్, వెలుగు: దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కేవలం వ్యక్తిగతమైనవి కావని, అవి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల ఫలితమేనని ఎస్ఎఫ్ఐ ఆలిండియా సహాయ కార్యదర్శి, జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఐషీ ఘోష్ అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా యువత సాగించిన జెన్ జీ పోరాటం దేశంలో ప్రశ్నించే తత్వానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్ అధ్యక్షతన ‘జెన్ జీ మీట్’లో ఆమె పాల్గొని, మాట్లాడారు. విద్యను కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ వైపు నడిపించే మోదీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా కోరుతూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటం స్ఫూర్తిదాయకమని, చారిత్రాత్మకమని ఆమె అభివర్ణించారు. ఆ పోరాట స్ఫూర్తి యువతలో ప్రశ్నించే తత్త్వాన్ని మరింత పెంచిందని కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ ఉద్యమం కొత్త దిశను చూపించిందని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఢిల్లీ పోరాట స్ఫూర్తితో తెలంగాణలో విద్యారంగ సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. విద్యాసంస్థల్లో సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. సదస్సులో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.మమత, డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, బి.శంకర్, జాయింట్ సెక్రటరీలు సుమ, కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రణయ్, లెనిన్ గువేరా, కార్తీక్, జునుగరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు