Kaizer News

కారుణ్య మరణానికి అనుమతినివ్వండి!.. లేదంటే రిటైర్మె

కారుణ్య మరణానికి అనుమతినివ్వండి!.. లేదంటే రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వండి

· State - Telangana · ntnews.com

కుటుంబ పోషణకు డబ్బుల్లేక నిత్యం నరకం చూస్తున్నా.. ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఓ కార్మికుడి ఆడియో సందేశం హైదరాబాద్‌, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ‘ఆర్టీసీలో పనిచేసినందుకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఎలాగూ ఇవ్వడం లేదు.. కనీసం నా కుటుంబ కారుణ్య మరణానికైనా అనుమతి ఇవ్వండి’ అంటూ ఓ ఆర్టీసీ రిటైర్డ్‌ కండక్టర్‌ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి ఆడియో సందేశం పంపాడు. కుటుంబ పోషణకు డబ్బుల్లేక నిత్యం నరకం అనుభవిస్తున్నామని కాచిగూడ డిపోలో 2024 అక్టోబర్‌లో కండక్టర్‌గా విరమణ పొందిన పెంటోజీ ఆవేదన వ్యక్తంచేశాడు. ‘మా కష్టానికి తగ్గట్టుగా రా వలసిన బకాయిలు రానందుకు మనోవేదన కలుగుతున్నది. దయచేసి నా మొర ఆలకించండి. దగ్గినా తుమ్మినా కేసులు పెట్టడం, మెమోలు ఇష్యూ చేయడం, ఇంక్రిమెంట్లు కట్‌ చేయడం మన తెలంగాణ ఆర్టీసీలో ఆనవాయితీ. ఆఫీసర్లంతా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లను ఏదో తప్పుచేసి జైలు శిక్ష అనుభవించడానికి వచ్చిన వారిలా ట్రీట్‌ చేస్తారు. సీఐ దగ్గరికి, ఎస్టీఐ దగ్గరికి డ్రైవర్‌, కండక్టర్‌ వెళ్లినా కూర్చోండని అనరు. గంటల తరబడి నిలబెడుతారు. కాళ్లు, చేతులు వణుకుతాయి’ అంటూ తన వేదనను పంచుకున్నాడు. బంధువులు, తెలిసినవాళ్లు చనిపోయారని విధులకు గైర్హాజరైతే ఫొటోలు పెట్టావా? అని వేధిస్తారని పెంటోజీ ఆవేదన వెళ్లగక్కాడు. ఒకవేళ చనిపోయిన మెసేజ్‌ వస్తే దినాలకు పోదురు లెండి అని ఇబ్బందులు పెడుతారని పేర్కొన్నాడు. చనిపోయిన వ్యక్తి పకన మీరు నిలబడి ఫొటో దిగి పంపండి అంటూ ఎన్నో సందర్భాల్లో కొందరు అధికారులు హుకూం జారీ చేశారని ఆవేదన వెళ్లగక్కాడు. ‘వీటన్నింటినీ భరిస్తూ ఉద్యోగాన్ని నెట్టుకొచ్చాను. రిటైర్మెంట్‌ అయిన కాలం నుంచి నాకు రావలసిన బకాయిలు రాక అన్న మో రామచంద్రా అనే పరిస్థితిలో ఉన్నా ను. నా గురిం చి ఎంక్వైరీ చేయండి. కేవలం నాకోసమే మాట్లాడుతున్నాను. అందులో డబ్బుల్లేవు. నాకు కారుణ్య మరణ అవకాశాన్ని కల్పించాలని మీ అందరి ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. నేను, నా భార్య, నా కొడుకు పూట గడవడం కష్టమవుతున్నది. హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్‌ ఇంతవరకు రాలేదు. కేవలం పీఎఫ్‌ 2,950, ఎస్‌ఆర్‌బీఎస్‌ 2,550తో ఇల్లు గడుపలేకపోతున్నాను. దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి డబ్బులు ఇప్పించండి’ అంటూ తన వేదనను ముగించాడు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, రవాణాశాఖ మంత్రి తక్షణం స్పందించాలని ఆర్టీసీ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News