Kaizer News

పట్టు పురుగు పెంపకంపై రైతులకు శిక్షణ

పట్టు పురుగు పెంపకంపై రైతులకు శిక్షణ

· State - Telangana · prabhanews.com

శాస్త్రీయ పద్ధతులు, వ్యాధుల నియంత్రణపై అవగాహన చెన్నూర్, ఆంధ్రప్రభ: ప ట్టు రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా నాణ్యమైన దిగుబడితో పాటు మెరుగైన ఆదాయం పొందవచ్చని అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పరిధిలోని లంబాడిపల్లి గ్రామంలో పట్టు రైతులకు శాస్త్రీయ పట్టు పురుగు పెంపకం, వ్యాధుల నియంత్రణ, పంట ప్రదేశం పరిశుభ్రత, మెరుగైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ, ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. లంబాడిపల్లి, ఎలకపేట గ్రామాలకు చెందిన 68 మంది రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రవేత్త, సంయుక్త సంచాలకుడు కె.పీ. కిరణ్‌కుమార్‌, శాస్త్రవేత్త కుమారి రమ్య రైతులకు వ్యాధుల నివారణ, సమగ్ర వ్యాధి నిర్వహణ, పంట ప్రదేశం పరిశుభ్రత, శాస్త్రీయ పెంపకం పద్ధతులపై అవగాహన కల్పించారు. దృశ్య ప్రదర్శనలు, చిత్రాల ద్వారా క్షేత్రస్థాయిలో పట్టు పురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం రైతులను పంట ప్రదేశానికి తీసుకెళ్లి జీవనసుధ, బ్లీచింగ్‌ పౌడర్‌, సున్నం వినియోగ పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. పట్టు ఉత్పత్తితో పాటు దారాన్ని తీసే ప్రక్రియ ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలను కిరణ్‌కుమార్‌ వివరించారు. రైతులు ఆసక్తి చూపితే గ్రామస్థాయిలో సామూహిక పట్టు దారాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో అవసరమైన యంత్రాలు, నైపుణ్య శిక్షణ అందించే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పట్టు రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబించి ఉత్పత్తి, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లంబాడిపల్లి సర్పంచ్‌ మహేష్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News