Kaizer News

నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలి..

నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలి..

· State - Telangana · prabhanews.com

కాలువల్లో నీళ్లు వదలాలి.. సీఎం వెంటనే జోక్యం చేసుకోవాలి.. హిందూ పండుగలను చులకనగా చూడొద్దు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, ఆంద్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ పరిధిలోని కాలువలు, చెరువుల్లో నీరు లేకపోవడంతో నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సీఎం వెంటనే జోక్యం చేసుకుని కాలువలకు నీటిని విడుదల చేయాలని కోరారు. పరిస్థితి చేయి దాటకముందే నిమజ్జన ఏర్పాట్లపై సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహించాలని సూచించారు. హిందూ పండుగలను ప్రభుత్వం చులకనగా చూడకూడదన్నారు. కాలువల్లో నీరు విడుదల చేయకపోతే గణేశ్ విగ్రహాలను రోడ్లపై ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడి శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని బండి సంజయ్ హెచ్చరించారు. గణేశ్ నిమజ్జనోత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయని, భక్తులు ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా అధికారులకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమజ్జనోత్సవాలు విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం బీజేపీ కార్యకర్త శ్రీశైలం కొన్న కొత్త ఆటోను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా నడిపి ప్రారంభించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.లక్ష కోట్ల మేర భూదోపిడీ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ మూడేళ్లుగా చర్యలు తీసుకోకపోవడం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ నేతలు 8 వేల ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలకు ప్రభుత్వం ఆధారాలు చూపించాలని ఆయన కోరారు. ఆధారాలు చూపిస్తే ఆ భూములను రక్షించి పేదలకు పంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మధ్య సాన్నిహిత్యం కారణంగానే భూవివాదాలపై ఇరుపార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇరు పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే బీఆర్‌ఎస్‌ నేతలపై చేస్తున్న రూ.లక్ష కోట్ల భూదోపిడీ ఆరోపణలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ప్రభుత్ బయటపెట్టాలని, ఆధారాలు లేకుంటే చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు, తెలంగాణ అభివృద్ధిపై చర్చించకుండా అసెంబ్లీలో రాజకీయ అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కూడా బండి సంజయ్ విమర్శలు చేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News