Shorts Nellore: కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో, ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం, బృందావనంలోని ఫినిక్స్ హాస్పిటల్ సమావేశ మందిరము నందు పక్షవాతంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వేశాఖ సబ్ ఇన్స్పెక్టర్ నరసాపురం హరిచందన ర్యాలీని జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం మరియు సమాజంపై తీవ్రప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమపిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ వారికి సరైన అవగాహన కల్పించాలని అన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనంవల్ల శారీరక, మానసిక, సామాజిక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని, యువతను క్రీడలు, విద్య, ఉపాధి మరియు సృజనాత్మక కార్యక్రమాల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన సమాజానికి చేయూతనివ్వండి” అనే సందేశంతో ర్యాలీలో నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. "పక్షవాతం లక్షణాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి" డాక్టర్ ఏ.వైష్ణవి, న్యూరో ఫిజీషియన్. పక్షవాతం లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణ వైద్యులు మరియు యువత భాగస్వాములు కావాలని తెలియజేశారు. పక్షవాతం (స్ట్రోక్) అకస్మాత్తుగా సంభవించే తీవ్రమైన ఆరోగ్య సమస్య అని, దీనిని సకాలంలో గుర్తించి వెంటనే వైద్యచికిత్స అందించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ముఖం ఒక వైపుకు వాలడం, ఒక చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం లేదా మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని ఆమె తెలియజేశారు. పక్షవాతం వచ్చిన వ్యక్తికి చికిత్స ఆలస్యం అయితే శాశ్వత వైకల్యానికి దారితీసే అవకాశం ఉందని అన్నారు. అనంతరం డాక్టర్ వైష్ణవిని, డాక్టర్ గోకుల్ కృష్ణన్ ను, ఎస్ఐ హరిచందన లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఎంపీ నాయకులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, నరసాపురం ప్రసాద్, దేవరకొండ శ్రీనివాసులు, చిట్లూరి వీరయ్య, ఉప్పలపాటి రామదాసు, ఆలూరు రాజేశ్వరరావు, నెల్లూరు సిటీ, నెల్లూరు డివిజన్లోని సభ్యులు పాల్గొన్నారు