Kaizer News

కొండా సురేఖకు బీజేపీ బంపరాఫర్ - మారుతున్న లెక్కలు.

కొండా సురేఖకు బీజేపీ బంపరాఫర్ - మారుతున్న లెక్కలు..!!

· State - Telangana · telugu.oneindia.com

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ వ్యవహారం ప్రభుత్వం.. అధికార కాంగ్రెస్ లో సంచలనంగా మారింది. పార్టీ హైకమాండ్ తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. సురేఖ మంత్రి పదవి పై వేటు ఖాయమని భావిస్తున్న వేళ... కొండా ఫ్యామిలీ తదుపరి అడుగుల పైన ఆసక్తి నెలకొంది. ఈ సమయంలోనే సురేఖ కు బీజేపీ నుంచి బంపరాఫర్ వచ్చింది. దీంతో.. సురేఖ ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. కొండా సురేఖ తో పాటు గా చిన్నారెడ్డి పైన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా కమిటీ సిఫారసు చేసింది. సీఎం రేవంత్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీలో చర్చలు జరగనున్నాయి. సురేఖ పైన నేరుగా మంత్రివర్గం నుంచి తప్పిస్తూ వేటు వేయటం కంటే రాజీనామా కోరటం మంచిదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. అయితే, మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టి సురేఖ తో సహా మరో ఇద్దరి పైనా వేటు వేసి.. కొత్త వారిని తీసుకోవాలనే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం పై ఢిల్లీ సమావేశాల్లో క్లారిటీ రానుంది. సురేఖ పై చర్య అయితే ఖాయమని.. ఏ విధంగా తీసుకోవాలనేదే ఇప్పుడు చర్చగా పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా.. తన పైన వేటు వేస్తే ఏ విధంగా స్పందించాలి అనే అంశం పైన ఇప్పటికే కొండా సురేఖ సిద్దం అయినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ పై మారిన కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన - ఇలా చేద్దాం..!? హైకమాండ్ నిర్ణయం తరువాతే స్పష్టత..! మంత్రి పదవి పైన వేటు వేస్తే కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాగా.. ఇదే సమయంలో సురేఖ కాంగ్రెస్ వీడితే ఏ పార్టీలో చేరుతారనే అంశం పైన భిన్నాభిప్రాయలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు సురేఖకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది. సురేఖ వ్యవహారం పైన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని... ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం వల్ల ఆమె పార్టీలోకి రావడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని చెప్పుకొచ్చారు. అయితే, సురేఖ తన మంత్రి పదవి పైన వేటు తరువాతనే భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో కొనసాగుతారా... లేక, పార్టీ మారుతారా అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ మొత్తం వ్యవహారం పైన వచ్చే వారం స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News