Kaizer News

శంషాబాద్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబా

శంషాబాద్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

· State - Telangana · ntnews.com

హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలమాకుల వద్ద వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి కల్వర్ట్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. మృతులను ఎస్టీ (లంబాడ) సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త కేతావత్ లింబ్య(54), కేతావత్ జమున (45), కత్రావత్ మాన్‌సింగ్ (48), కేతావత్ వాస్రం(45)గా గుర్తించారు. వీరంతా తమ స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మెట్టుగడ్డతండా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదానికి అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌నే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News