భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 22న రాప్తాడులో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదివారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రాప్తాడులో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాల ఆవిష్కరణకు నారా లోకేష్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో కలిసి ఎస్పీ వివిధ ప్రాంతాలను పరిశీలించారు. విగ్రహాల ఆవిష్కరణ ప్రాంగణం, కార్యకర్తల సమావేశ వేదిక, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, ఎంఎస్ రాజు మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, రాప్తాడు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గంగలకుంట కృష్ణ, కురుబ సాధికార రాష్ట్ర చైర్మన్ రమణ, నారా లోకేష్ టీం సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు