Shorts రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో పద్మశ్రీ, పద్మభూషణ్ బోయి భీమన్న 115వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సాయిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయి భీమన్న జీవితాన్ని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సాధారణ పాలేరు కుటుంబ నేపథ్యం నుంచి తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి, తన ప్రతిభ, పట్టుదల, రచనా వ్యాసంగంతో పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న భీమన్న జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక వివక్ష, అంటరానితనాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి బోయి భీమన్న విశేష కృషి చేశారని తెలిపారు. అధ్యాపకుడిగా కూడా సేవలందిస్తూ విద్యార్థులకు, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఆయన సాహిత్యం సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ, సమానత్వం వైపు ప్రజలను నడిపించేలా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు విభాగాధిపతి డా. పి. లావణ్య బోయి భీమన్న సాహిత్య ప్రస్థానం, సామాజిక చైతన్యానికి ఆయన చేసిన కృషిని వివరించారు. విద్యార్థులు భీమన్న రచనలను చదివి ఆయన ఆశయాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ నల్లి రాజు, తెలుగు విభాగాధిపతి డా. పి. లావణ్య, చరిత్ర అధ్యాపకులు శ్రీ కె. నాగరాజు, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు