భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో ఆమె వికెట్ల సంఖ్య 171కి చేరింది. దీంతో థాయ్‌లాండ్‌కు చెందిన తిపచా పుత్తవాంగ్‌ను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్ - థాయ్‌లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 159/9 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన థాయ్‌లాండ్‌ను భారత బౌలర్లు 65 పరుగులకే కుప్పకూల్చారు. భారత్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలింగ్‌లో దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన చేసింది. కేవలం 1.1 ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసుకుంది. ఈ ప్రదర్శనతోనే ఆమె మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ దీప్తి శర్మకు ఎంతో ప్రత్యేకం. ఇది ఆమెకు 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్. ఈ ఘనత సాధించిన భారత మహిళా క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన తర్వాత దీప్తి మూడో క్రికెటర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 150 లేదా అంతకంటే ఎక్కువ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఆమె 12వ స్థానంలో ఉంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో దీప్తి శర్మ 171 వికెట్లతో అగ్రస్థానంలో ఉంది. థాయ్‌లాండ్‌కు చెందిన తిపచా పుత్తవాంగ్ 170 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. రువాండా బౌలర్ హెన్రియెట్ ఇషిమ్వే 164 వికెట్లతో మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ 154 వికెట్లతో నాలుగో స్థానంలో, హాంకాంగ్‌కు చెందిన కరీ చాంగ్ 153 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. రికార్డు సాధించిన అనంతరం దీప్తి శర్మ తన వ్యక్తిగత మైలురాయి కంటే జట్టు కోసం మెరుగ్గా ఆడటమే ముఖ్యమని చెప్పింది. భారత జెర్సీ ధరించడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని పేర్కొంది. ప్రత్యర్థి ఎవరనే దానిపై కాకుండా.. తన బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకుని జట్టుకు సహకరించడంపైనే దృష్టి పెడతానని తెలిపింది