Kaizer News

రేషన్‌ డీలర్‌ ఇంట్లో సుమారు 50 తులాల బంగారం చోరీ

రేషన్‌ డీలర్‌ ఇంట్లో సుమారు 50 తులాల బంగారం చోరీ

· State - Telangana · prabhanews.com

దొంగల వ్యూహంతో పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన మాక్లూర్, ఆంధ్రప్రభ : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రేషన్‌ డీలర్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన రేషన్‌ డీలర్‌ వేములపల్లి శ్రీను నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబంతో హైదరాబాద్‌ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువాలో భద్రపరిచిన సుమారు 50 తులాల బంగారాన్ని అపహరించారు. దాదాపు రూ.75 లక్షల విలువైన బంగారం చోరీకి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఇంట్లో ఉన్న నగదు, పట్టుచీరలను ముట్టుకోకుండా కేవలం బంగారాన్ని మాత్రమే దోచుకెళ్లడం గమనార్హం. ఆదివారం ఉదయం రేషన్‌ డీలర్‌ ఇల్లు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు హైదరాబాద్‌లో ఉన్న శ్రీనుకు సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఇంటికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మాక్లూర్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు పోలీసులకు, జాగిలాలకు ఎలాంటి ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు ఇంటి అంతటా కారంపొడి చల్లినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు అనుసరించిన ఈ పద్ధతి పోలీసులకు సవాల్‌గా మారింది. భారీగా బంగారం చోరీ కావడంతో పాటు, ఆనవాళ్లు దొరకకుండా దుండగులు వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Original source: prabhanews.com
Read more on Kaizer News