స్పీకర్ ‘కాలయాపన’ వ్యూహానికి ఇక రాష్ట్రంలో కాలం చెల్లినట్టే.. రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వత మార్పునకు ఫిరాయింపులపై హైకోర్టు తీర్పుతో నాంది స్పష్టం చేస్తున్న రాజకీయ, న్యాయ నిపుణులు హైదరాబాద్, సెస్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్‌ఎస్ బీ ఫారం మీద గెలిచారు, పార్టీ మారి అధికారపక్షం గూటికి చేరారు. అసెంబ్లీలోనూ అదే పక్షంవైపు కూర్చున్నారు, కార్యక్రమాల్లోనూ బాజాప్తా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఫొటోలకు పోజులు ఇచ్చారు. కానీ పదవికి మాత్రం గులాబీ పార్టీ గుర్తింపునే పట్టుకొని వేలాడుతున్నారు. అధికారికంగా ‘బీఆర్‌ఎస్ సభ్యులమే’ అంటూ దబాయిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో రెండున్నరేండ్లుగా సాగుతున్న తంతు ఇది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు ఆడుతున్న వికృత క్రీడ ఇది. ఈ ‘జంప్ జిలానీ’లకు హైకోర్టు దిమ్మతిరిగేలా ఝలక్ ఇచ్చింది. గోడదూకిన వాళ్లలో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటువేసింది. స్పీకర్ నిర్ణయాన్ని పకనబెట్టింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు స్పీకర్ ముందు తిరసరణకు గురైన మిగిలిన ఫిరాయింపు కేసులకు కూడా ఇదే తీర్పు వస్తుందా? అనే చర్చ మొదలైంది. దానం నాగేందర్‌పై పడ్డ వేటు.. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి దూకిన మిగిలిన ఎనిమిదిమంది ఎమ్మెల్యేల మెడపై కత్తిలా వేలాడుతున్నది. ఇప్పటికే కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య (చేవెళ్ల), సంజయ్‌కుమార్ (జగిత్యాల), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల)పై అనర్హత పిటిషన్లు కోర్టుల పరిశీలనలో ఉన్నాయి. తెల్లం వెంకట్రావు అందరికన్నా ముందే జంప్ కాగా, లోక్‌సభ ఎన్నికల వేళ కూతురికి ఎంపీ టికెట్ కోసం కడియం గోడ దూకారు. గతంలో స్పీకర్‌గా పనిచేసిన సీనియర్ నేత పోచారం కాంగ్రెస్‌లో చేరడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం వివాదాన్ని మరింత రాజేసింది. మిగిలినవారు సైతం ‘ప్రభుత్వ మద్దతు, నియోజకవర్గ అభివృద్ధి’ పేరుతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనేది బహిరంగ రహస్యం. దానం వ్యవహారంలో కోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో మిగతావారిపై కూ డా వేటు లాంఛనమే అని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో అధికార పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు స్పీకర్ వ్యవస్థ కాలయాపనను ప్రధాన అస్త్రంగా మార్చుకునేది. అనర్హత పిటిషన్లపై నోటీసులు ఇవ్వడం, సమాధానాలకు గడువు పొడిగించడం, విచారణల పేరుతో ఐదేండ్ల పదవీ కాలం పూర్తయ్యేవరకు నెట్టుకొచ్చే సంప్రదాయం నడిచేదని రాజకీయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత స్పీకర్ సైతం తొమ్మిది మంది అనర్హత పిటిషన్లపై మొదట్లో నాన్చుడు ధోరణి అవలంబించారన్న విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు గతంలో ‘కిహోతో హోల్లోహన్’ కేసుతోపాటు ‘సుభాష్ దేశాయ్ (మహారాష్ట్ర)’ కేసులో నిర్దిష్ట కాలపరిమితిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినా, తెలంగాణలో మ