అక్షిత మృతికి కారకులను వెంటనే అరెస్టు చేయాలి మాదిగ మహాశక్తి రాష్ట్ర నేత ఆసం పెళ్లి శ్రీనివాస్ గోదావరిఖని, ఆంధ్రప్రభ: మాదిగ జాతులపై జరుగుతున్న దాడులు, అరాచకాలు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని మాదిగ మహాశక్తి తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు ఆసంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితరాణి ఆత్మహత్యకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుల అరెస్టులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్షిత సూసైడ్ నోట్‌లో పేర్కొన్నప్పటికీ, ఇప్పటివరకు కారకులను అరెస్టు చేయకపోవడం సమంజసం కాదని ఆసంపల్లి శ్రీనివాస్ అన్నారు. అక్షిత మృతికి కారకులైన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్షిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి కోటి రూపాయల పరిహారం అందించాలని కోరారు. అక్షిత ఆత్మహత్య ఘటనపై పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు, రామగుండం ఎమ్మెల్యే ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. రామగుండం ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపించారు. అక్షిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మాదిగ మహాశక్తి ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో మాదిగ మహాశక్తి ప్రతినిధులు స్వప్న, కుక్క కనకరాజు, ఆసంపల్లి రవీందర్, నాతరి ఆదిత్య, పోయిల సాగర్, కుక్క అశోక్ తదితరులు పాల్గొన్నారు