హైదరాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి కర్నాటకలో ప్రారంభం కానున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని కేవలం రాజకీయ పార్టీ కార్యక్రమంగా చూడకుండా, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం కలిగిన గొప్ప సేవా ఉద్యమంగా మార్చాలని బీజేపీ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల సహ ఇన్:చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర అధ్యక్షతన జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశానికి ఆయన గౌరవఅతిథిగా హాజరై మాట్లాడారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, మండల, బూత్ స్థాయి వరకు బలంగా తీసుకెళ్లేలా సమగ్ర కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలోనూ పార్టీ శ్రేణులు ప్రజల మధ్యకు వెళ్లి సేవా కార్యక్రమాల ద్వారా పార్టీ సిద్ధాంతాలను చేరవేయాలని సూచించారు. పరిశుభ్రత కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు, యువత - మహిళల భాగస్వామ్యంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలోని అన్ని వర్గాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తన ప్రజా జీవితంలో పేదల సంక్షేమం, సేవ, సుపరిపాలన, జాతీయ అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారని, అదే స్ఫూర్తిని ఈ అభియాన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షేలార్, కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ, కర్నాటక ఎస్‌ఐఆర్ కన్వీనర్ దత్తాత్రేయ, సేవా సంకల్ప్ అభియాన్ కన్వీనర్ ఎన్ఎస్ నందీష్ రెడ్డి, లింగరాజ్ పాటిల్, ఎమ్మెల్యేలు ధీరజ్ మునిరాజ్, శైలేంద్ర బెల్దాలే తదితరు పాల్గొన్నారు