Asian Games : జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో భారత బృందం ఆకట్టుకుంటోంది. షూటర్ ఎలవెనిల్ (Elavenil Valarivan) రెండు వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో రజతంతో మెరవగా.. తెక్‌బాల్(Tekball) కాంస్య పోరులో క్వింసీ డిసౌజా (Quimcy D’Souza)కు చుక్కెదురైంది. బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత మహిళల జట్టు ఫైనల్ చేరింది. బ్యాడ్మింటన్‌లో సింధు సేన క్వార్టర్స్ ఆడనుంది. హాకీలో పురుషుల, మహిళల జట్లు భారీ విజయంతో రెండో రౌండ్‌లో అడుగుపెట్టాయి. టేబుల్ టెన్నిస్‌లో అమ్మాయిల టీమ్ ముందంజ వేయగా.. అబ్బాయిల బృందం ఓడిపోయింది. నగోయలోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఆదివారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, బృందం విభాగాల్లో ఎలవెనిల్ వలరివన్ వెండి వెలుగులు విరజిమ్మింది. అపై మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)లో సుచికా తరియల్ (Suchika Tariyal) సెమీస్ చేరిన పతకం ఖాయం చేసింది. అయితే.. తెక్‌బాల్‌లో సంచలన విజయాలతో ఆశలు రేపిన క్వింసీ డిసౌజా నిరాశపరిచింది. వ్యక్తిగత, మిశ్రమ విభాగాల కాంస్య పోరులో డిసౌజా ఓటమిపాలైంది. స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో రిషభ్ దాస్ ఆరో స్థానంలో నిలిచాడు. సియా క్రీడల్లో భారత హాకీ జట్లు శుభారంభం చేశాయి. ఏకపక్షంగా సాగిన గ్రూప్ దశ తొలి పోరులో ఉజ్బెకిస్థాన్‌ను మహిళల జట్టు 19-0తో మట్టికరిపించింది. ఇండోనేషియాపై పురుషుల జట్టు 13-1తో జయభేరి మోగించింది. టేబుల్ టెన్నిస్‌లో మహిళల బృందం సంచలన ఆటతో సింగపూర్‌కు చెక్ పెట్టింది. ఉత్కంఠ పోరులో 3-2తో ముందంజ వేసింది. కానీ, పురుషుల టీమ్ మాత్రం.. ఇరాన్ చేతిలో 0-3తో ఓడిపోయింది. మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు చెలరేగడంతో భారత బృందం క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్‌లో కజకిస్థాన్ షట్లర్లకు సింధు, ఉన్నాటి హుడా, తన్వీ శర్మలు చుక్కలు చూపించారు. కమలియాపై వరస సెట్లలో విరుచుకుపడిన తెలుగు తేజం 21-7, 21-9తో విజయం సాధించింది. అంతకుముందు.. ఉన్నాటి 21-7, 21-19తో అలిస్సాపై, తన్వి 21-5, 21-10తో డయానాపై గెలుపొందారు. మొత్తంగా ముగ్గురు కలిపి 65 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించగా.. భారత బృందం దర్జాగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది