Shorts కరీంనగర్ : కరీంనగర్ లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక బడ్జెట్ కేటాయించామని, నగరాన్ని కాషాయమయం చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా అత్యంత భక్తియుత, ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా నిమజ్జన ఉత్సవాలు జరుపుకోవాలని కరీంనగర్ ప్రజలకు విజ్ఝప్తి చేశారు. పుకార్లను నమ్మొద్దని కోరారు. గణేశ్ నిమజ్జనాల సందర్భంగా పోలీసులు అత్యంత సంయమనం పాటించాలని సూచించారు. ఈరోజు ఉదయం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రామచంద్రరావు, స్రుజన్ రెడ్డి, తిరుమల్, బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో సమావేశమై గణేశ్ నిమజ్జన ఉత్సవాల రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. ‘‘ప్రశాంతతకు భక్తియుత వాతావరణానికి కరీంనగర్ ప్రతీక. ఈసారి గణేశ్ నిమజ్జన ఉత్సవాలను అత్యంత శోభాయమనంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. మంచినీళ్లు సహా కనీస సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంచుతున్నాం. దయచేసి పోలీసులు సహకరించాలి. పోలీసులకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితో మేయర్, డిప్యూటీ మేయర్ తో మాట్లాడండి. భక్తులతో మాట్లాడి ఇబ్బందుల్లేకుండా సాఫీగా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకుంటాం.’’అని చెప్పారు. కొందరు కావాలనే గొడవ చేసి నిమజ్జన ఉత్సవాల ప్రశాంతతను చెడగొట్టాలని కుట్ర చేసే ప్రమాదం ఉందని, అట్లాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశానంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరూ భక్తియుత, ధార్మిక వాతావరణంలో నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలి. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరుతున్నా. ప్రశాంతతగా మారుపేరు కరీంనగర్ అని నిరూపిద్దాం. అధికారులు, పోలీసుల నుండి ఏమైనా ఇబ్బందులుంటే మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను సంప్రదించండి. తప్పకుండా ఇబ్బందులను తొలగిస్తాం.’’అని కోరారు. ‘‘కరీంనగర్ లో గణేశ్ నవరాత్రి నిమజ్జన ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించబోతున్నం. గతంకంటే ఎక్కువ బడ్జెట్ ను ఈసారి కేటాయించాం. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత పవిత్రమైనవి. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తితో నిష్టగా ఎవరు చేసినా సక్సెస్ అవుతారు. ఈసారి గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా కన్పిస్తుండటం హర్షణీయం’’అని చెప్పారు