ఆధునిక సాంకేతికతపై అవగాహన.. కెరీర్ ఎంపికపై మార్గనిర్దేశం మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాల (జేపీఎన్‌సీఈ)లో పీఎం శ్రీ హైస్కూల్, తాటికొండ విద్యార్థులకు ఇండస్ట్రీ, ఐటీ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 8, 9, 10వ తరగతులకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాలలోని వివిధ ఇంజినీరింగ్, సాంకేతిక ప్రయోగశాలలను సందర్శించారు. ప్రయోగశాలల పనితీరుతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పొందారు. సాంకేతిక రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను తెలుసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కృష్ణమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే తమ ఆసక్తులు, ప్రతిభను గుర్తించి సరైన కెరీర్‌ను ఎంచుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కళాశాల సీవోఈ కె.సందీప్‌కుమార్, హెచ్‌ఓడీలు డాక్టర్ ఎన్.రాజేష్‌కుమార్, చి.వెంకటేష్, సమన్వయకర్తలు బి.చెన్నయ్య, పీడీ, ఎం.జగదీష్, ఎ.స్వాతి తదితరులు పాల్గొన్నారు