Kaizer News

ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్..

ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్..

· State - Telangana · prabhanews.com

జీతాలు చెల్లించకుంటే సెప్టెంబర్‌ 1న ధర్నా: ఐఎఫ్‌టీయూ క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : మందమర్రి డివిజన్‌ పరిధిలోని రామకృష్ణాపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లోని సులభ్‌ కాంప్లెక్స్‌లలో పనిచేస్తున్న పారిశుధ్య కాంట్రాక్ట్‌ కార్మికులకు గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్‌ 1న మందమర్రి జీఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు సింగరేణి సులభ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టీయూ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డి. బ్రహ్మానందం తెలిపారు. ఆదివారం రామకృష్ణాపూర్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం సులభ్‌ కాంప్లెక్స్‌ల నిర్వహణ టెండర్‌ను ఉజ్వల్‌ సంస్థకు ఇవ్వగా, సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ వేసిందని తెలిపారు. సింగరేణి న్యాయవాదులు సరిగా వాదించకపోవడం వల్ల కేసు పెండింగ్‌లో ఉందని ఆరోపించారు. ఈ వివాదాన్ని సాకుగా చూపి యాజమాన్యం రెండు సంస్థలకు టెండర్‌ ఇవ్వకుండా జాప్యం చేస్తోందని అన్నారు. జూలై 17న ప్రధాన కార్యాలయం ముట్టడి అనంతరం సులభ్‌ కాంప్లెక్స్‌లను ఏడాది పాటు పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా, జీఎం కార్యాలయ స్థాయిలో బిల్లులు నిలిపివేసి నిధులు లేవనే కారణంతో వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. వేతనాలు అందక కార్మికులు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌, బోనస్‌, బీమా వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలను వెంటనే ఒకేసారి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సెప్టెంబర్‌ 1న చేపట్టనున్న ధర్నాను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల వెంకటేష్‌, మల్లేష్‌, శేఖర్‌, అప్పారావు, నరసయ్య, నాగరాజు, మల్లయ్య, ఉమ, ఈశ్వరమ్మ పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News