Kaizer News

నాలుగేండ్లలోనే 400కుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన

నాలుగేండ్లలోనే 400కుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు

· State - Telangana · ntnews.com

సరికొత్త ఘనత సాధించిన యశోద దవాఖాన మాదాపూర్‌లో కిడ్నీ సింపోజియం-2026 మాదాపూర్‌, ఆగస్టు 29: మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సతో ఎంతో ఉపశమనం లభిస్తుందని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. యశోద దవాఖాన వైద్యులు గత నాలుగేండ్లలో 400కుపైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. శనివారం ఆయన మాదాపూర్‌ హైటెక్స్‌లోని యశోద హాస్పిటల్‌లో ‘కిడ్నీ సింపోజియం-2026’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏటా ఎంతో మంది కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లడం తగ్గించి ఇంటి భోజనం తినాలని, ప్రతి 6 నెలలకోసారి రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కిడ్నీ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు, హాస్పిటల్స్‌ నిర్వాహకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి వైద్యం అందుతున్నదని, బయటి దేశాలతో పోల్చితే మన దేశంలోనే తక్కువ ధరకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని తెలిపారు. వైద్యవిద్య కోసం మన విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొత్త మెడికల్‌, ఫార్మా కళాశాలలను అందుబాటులోకి తీసుకొస్తున్నదని చెప్పారు. ఇప్పటికే ఎంబీబీఎస్‌ సీట్లను రెట్టింపు స్థాయికి పెంచడంతోపాటు 25 ఎయిమ్స్‌ మెడికల్‌ కళాశాలలను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదేనని పేర్కొన్నారు. ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలను అందించాలన్న లక్ష్యంతో కేంద్రం జెనరిక్‌ మెడికల్‌ షాపులను అందుబాటులోకి తీసుకొచ్చిందని, పేద, మధ్య తరగతి ప్రజల కోసం తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ 70 కోట్ల మందికి చేరువైందని చెప్పారు. సమిష్టి కృషితోనే.. హైటెక్‌ సిటీ యశోద దవాఖానలో మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 400కుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు విజయవంతంగా నిర్వహించడం తమకు ఎంతో గర్వకారణమని యశోద గ్రూప్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ జీ సురేందర్‌రావు తెలిపారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో ఆధునిక సాంకేతికతతోపాటు అనుభవజ్ఞులైన వైద్యనిపుణుల సమిష్టి కృషితో మెరుగైన ఫలితాలను సాధించగలుగుతున్నామని వివరించారు. కేవలం సర్జరీతో ముగిసేది కాదు.. కిడ్నీ మార్పిడి అనేది కేవలం ఒక శస్త్రచికిత్సతో ముగిసే ప్రక్రియ కాదని ‘యశోద’ నెఫ్రాలజీ విభాగం క్లినికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజశేఖర చక్రవర్తి తెలిపారు. దాత-గ్రహీతల సరైన ఎంపిక, ట్రాన్స్‌ప్లాంట్‌కు ముందు సమగ్ర వైద్య మూల్యాంకనం, వివిధ వైద్య విభాగాల సమన్వయం, శస్త్రచికిత్స అనంతరం జరిపే నిరంతర పర్యవేక్షణ, దీర్ఘకాలిక ఫాలోఅప్‌ తదతర అంశాలన్నీ మంచి ఫలితాలను సాధించడంలో కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. ట్రాన్స్‌ప్లాంట్‌ అనంతరం కూడా రోగులు క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణలో ఉండటం, వైద్యులు సూచించిన మందులను సక్రమంగా తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News