హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)–పీజీ 2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో మొత్తం14 జిల్లాల్లోని 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 17,626 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 17,143 మంది పరీక్షకు హాజరయ్యారు. 483 మంది గైర్హాజరవడంతో మొత్తం 97.26 శాతం హాజరు నమోదైంది. అన్ని కేంద్రాల్లో పరీక్షలు సజావుగా సాగాయని అధికారులు వెల్లడించారు. పరీక్షల నిర్వహణ తీరును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రీజనల్ కమాండ్ కంట్రోల్ (లైవ్ మానిటరింగ్) సెంటర్‌ను ఆయన సందర్శించారు. అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 56 పరీక్షా కేంద్రాలను లైవ్ సీసీటీవీ దృశ్యాల ద్వారా పరిశీలించారు. దేశవ్యాప్తంగా 349 నగరాల్లోని 1,111 కేంద్రాల్లో నీట్–పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రెసిడెంట్ డాక్టర్ అభిజత్ సేథ్ వెల్లడించారు. ఎలాంటి పేపర్ లీకేజీలు, హ్యాకింగ్ లేదా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు రాలేదని, పూర్తి పారదర్శకంగా పరీక్ష జరిగిందని తెలిపారు. అయితే రాజస్థాన్ జైపూర్‌లోని సీతాపుర కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తడం వల్ల అక్కడ 2,440 మంది అభ్యర్థులకు పరీక్షను వాయిదా వేసినట్లు చెప్పారు