ఈ నెల 21న వరల్డ్ అల్జీమర్స్ డే నేను అనే ఉనికి మనిషిని మిగతా జీవులకి భిన్నంగా ఉంచుతున్నది. నా వ్యక్తిత్వం అనే అవగాహన తనను మిగతా మనుషుల్లో ప్రత్యేకంగా నిలుపుతున్నది.ప్రతి పేరు వెనుకా ఏండ్ల తరబడి ఏర్పరుచుకున్న అభిప్రాయాలు, దాటిన కష్టాలు, నిలబెట్టుకున్న పరపతి, సంపాదించిన ఆస్తి, మంచిచెడుల ప్రవర్తన, అలవాట్లు, ఇష్టాయిష్టాలు, బంధాలు, జ్ఞాపకాలు.. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా క్రమంగా సన్నగిల్లుతుంటే.. కట్టుకున్న ఇల్లు, తోడున్న కుటుంబం, చివరికి తన పేరును సైతం మర్చిపోతే.. అదే అల్జీమర్స్! అలాగని అధైర్య పడనక్కర్లేదు. అల్జీమర్స్‌కి ఇప్పుడు చాలా మంచి మందులే వచ్చాయి. చికిత్సా పద్ధతుల్లోనూ వేగం పెరిగింది. వీటన్నిటికీ మించి అవగాహన ముఖ్యం. ఆ అవగాహన కల్పించే సందర్భమే ‘వరల్డ్ అల్జీమర్స్ డే’. వయసుతో పాటు జ్ఞాపకశక్తి తగ్గడం వేల ఏండ్ల నుంచి గమనిస్తున్నదే. భారతీయుల నుంచి గ్రీకు వైద్యుల వరకూ సంప్రదాయ వైద్యంతో సరిదిద్దే ప్రయత్నం చేసేవారు. కొంతమందిలో మతిమరుపునకు కారణం కేవలం వయసు కాదనీ వారి మెదడులో ఉన్న సమస్య అని 1901లో గుర్తించారు. అలా గుర్తించిన వైద్యుడే అల్జీమర్. అతని పేరు మీదుగానే ఈ వ్యాధి స్థిరపడిపోయింది. అగస్ట్‌డెటర్ అనే 50 ఏండ్ల రోగిలో ఒక్కసారిగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, భ్రమల్లో గడపడం చూసిన అల్జీమర్, దీని వెనుక ఏదో ప్రత్యేకమైన వ్యాధి ఉందని గుర్తించాడు. కానీ, అల్జీమర్స్ గురించిన ప్రచారం మాత్రం నిదానంగానే గడిచింది. పైగా అవగాహన కంటే అపోహలే ఎక్కువగా సాగేవి. ఇలాంటి సమయంలో Alzheimer’s Disease International అనే సంస్థ దీని మీద ప్రచారానికి పూనుకుంది. అందులో భాగంగానే 1994 నుంచి ఏటా సెప్టెంబర్ 21ని ‘వరల్డ్ అల్జీమర్స్ డే’గా నిర్వహిస్తున్నది. కారణం స్పష్టం? అమెలాయిడ్ బీటా ప్రొటీన్, టావ్ ప్రొటీన్ ఈ రెండు ప్రొటీన్ల తీరులో ఏర్పడే సమస్యే అల్జీమర్స్‌కి దారి తీస్తుందని కనిపెట్టారు. అమెలాయిడ్ ప్రొటీన్ విపరీతంగా ఉత్పత్తి అవుతూ న్యూరాన్ల మధ్య అడ్డుగోడలా నిలుస్తుంది. ఇక టావ్ ప్రొటీన్ న్యూరాన్లు దెబ్బతినేలా చేస్తుంది. ఈ రెండు సమస్యలూ కలిసి అల్జీమర్స్‌కి దారితీస్తాయి. అల్జీమర్స్ ఎలా వస్తుందో తెలిసింది. కానీ, ఎందుకు వస్తుందనే దానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వంశపారంపర్యం. రక్త సంబంధీకులలో ఎవరో ఒకరికి ఈ సమస్య ఉంటే అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువని అంటారు. ఇందులో కూడా ఓ వైవిధ్యం ఉంది. APOE e4 అనే జన్యువు సంక్రమిస్తే సదరు వ్యక్తికి అల్జీమర్స్ రావచ్చు, రాకపోవచ్చు. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు మందిలో ఈ జన్యువు ఉంటుంది. కానీ, అందరికీ అల్జీమర్స్ రావాలని లేదు. APP, PSEN1, PSEN2 అనే మూడు జన్యువులలో సమస్య ఉంటే అల్జీమర్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా డౌన్ సిండ్రోమ్, MCI (Mild cognitive impairment) అనే సమస్య, తలకు తీవ్రమైన గాయాలు కావడం లాంటివి కూడా మన చేతుల్లో లేని కారణాలు. అయితే మన వాతావరణం, జీవనశైలి, అలవాట్లు కూడా అల్జీమర్స్ రావడానికి లేదా తీవ్రతరం కావడానికి కారణం అవుతున్నాయంటూ లాన్సెట్ ప్రకటించిన ఓ నివేదిక సంచలనం సృష్టించింది. ఈ జాబితాలో