Kaizer News

ఆరేళ్ల కుమార్తెను నడుముకు కట్టుకుని బావిలో దూకిన త

ఆరేళ్ల కుమార్తెను నడుముకు కట్టుకుని బావిలో దూకిన తల్లి.. మంచిర్యాల జిల్లాలో విషాదం

· State - Telangana · ntnews.com

పుట్టింట్లో ఉంటున్నా కష్టాలు వెంటాడుతున్నాయనే మనస్తాపంతో ఓ తల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. 18 నెలల కుమారుడిని ఇంట్లో నిద్రపుచ్చి.. ఆరేళ్ల కుమార్తెను నడుముకు కట్టుకుని బావిలో దూకింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగాపూర్‌ గ్రామానికి చెందిన గొట్ల రజిత (26)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమార్తె అక్షిత (6), కుమారుడు మహేందర్‌ (18 నెలలు) ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో రజిత తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నారు. అంజయ్య అప్పుడప్పుడు వచ్చి పిల్లలను చూసుకుని వెళ్తుండేవారు. ఆదివారం ఉదయం రజిత తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఈ సమయంలో ఎప్పటిలాగే అంజయ్య ఇంటికి వచ్చి పిల్లలను చూసుకుని వెళ్లారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే రజిత తన 18 నెలల కుమారుడిని నిద్రపుచ్చి.. కుమార్తె అక్షితను వెంట తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకున్న ఆమె.. కుమార్తెను నడుముకు కట్టుకుని బావిలో దూకినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రజిత జన్నారం మండలంలో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాతే కుమార్తెను వెంట తీసుకుని బావి వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది? ఆ సమయంలో ఏం జరిగింది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో తల్లీకూతుళ్ల మృతదేహాలు తేలియాడుతుండటాన్ని అటుగా వెళ్తున్న వారు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఒకే ఘటనలో తల్లితో పాటు ఆరేళ్ల చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది

Original source: ntnews.com
Read more on Kaizer News