రఘు మాస్టర్‌కు మెజారిటీ మద్దతు! సుమలత దేవి కార్యవర్గానికి సహాయ నిరాకరణ.. కొత్త నాయకత్వంపై డ్యాన్సర్ల నిర్ణయం హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలుగు చలనచిత్ర, టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత దేవి నేతృత్వంలోని కార్యవర్గానికి బదులుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనే దిశగా మెజారిటీ యూనియన్ డ్యాన్సర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే కొత్త కార్యవర్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు యూనియన్ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణానగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మెజారిటీ డ్యాన్సర్లు సమావేశమై అసోసియేషన్ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. ప్రస్తుతం సుమలత దేవి నేతృత్వంలోని కార్యవర్గానికి ఇప్పటికే పలువురు డ్యాన్సర్లు సహాయ నిరాకరణ ప్రకటించిన నేపథ్యంలో కొత్త నాయకత్వం అవసరమనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఈ క్రమంలో రఘు మాస్టర్‌ను అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకుని, ఆయన నాయకత్వంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని మెజారిటీ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. డ్యాన్సర్ల సమస్యల పరిష్కారం, అసోసియేషన్ కార్యకలాపాల నిర్వహణకు కొత్త కార్యవర్గం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందనే అభిప్రాయానికి వచ్చినట్లు యూనియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాము ఎన్నుకునే రఘు మాస్టర్ కార్యవర్గాన్ని అసోసియేషన్ అధికారిక కార్యవర్గంగా గుర్తించాలని సంబంధిత ఫిల్మ్ ఫెడరేషన్‌ను కోరాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఫెడరేషన్ ప్రతినిధులను కలిసి తమ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కార్యవర్గానికి బదులుగా కొత్త కార్యవర్గానికి గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌తో యూనియన్ సభ్యులు ముందుకు సాగుతున్న నేపథ్యంలో డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రఘు మాస్టర్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారా? కొత్త కార్యవర్గానికి ఫిల్మ్ ఫెడరేషన్ గుర్తింపు ఎప్పుడు లభిస్తుంది? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొత్తంగా డ్యాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాల మధ్య రఘు మాస్టర్‌కు మెజారిటీ డ్యాన్సర్ల మద్దతు లభించిందన్న సమాచారం కొత్త మలుపుకు దారితీసింది. రానున్న రోజుల్లో అసోసియేషన్ నాయకత్వంపై మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది