Tuni: తుని పట్టణంలో భిక్షాటన రోజురోజుకూ ఒక వ్యసనంగా, సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా మారుతోంది. పట్టణంలోని మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ప్రతిరోజూ ఉదయం నుంచే కొందరు పెద్దలు పసిపిల్లలను వెంటేసుకుని రోడ్లపై కనిపిస్తున్నారు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడక, సులువుగా డబ్బు సంపాదించవచ్చనే (ఈజీమనీ) దుర్బుద్ధితో కొందరు పెద్దలు చిన్న పిల్లలను కూడా ఈ భిక్షాటన వృత్తిలోకి దించుతున్నారు. అభం శుభం తెలియని ఆ పసివాళ్లను రోడ్ల వెంబడి తిప్పుతూ, దారిన పోయే వారిని డబ్బుల కోసం అడుగుతూ వారి బాల్యాన్ని బలిగొంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విధంగా బిక్షాటన సాగిస్తున్న వారు ఎక్కువగా తుని ఆర్టీసీ బస్టాండ్ పక్కనే నివసిస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ఈ విధంగా రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేస్తూనే ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చిన్న పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న ఈ దారుణమైన పరిస్థితి వల్ల ఆ పసివాళ్ల భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి నెట్టబడుతోంది. చదువుకోవాల్సిన వయస్సులో, ఆడుకోవాల్సిన ప్రాయంలో ఇలా రోడ్లపాలు కావడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ శాఖ స్పందించి తునిలో పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, ఆ పసిపిల్లలకు పునరావాసం కల్పించి వారి భవిష్యత్తును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు