Kaizer News

ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై అవగాహన..

ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై అవగాహన..

· State - Telangana · prabhanews.com

ఖమ్మం, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో పాటు ఓటర్ల జాబితాలోని వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, సవరణలు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు చిరుమామిళ్ల నాగేశ్వరావు సూచించారు. ఖమ్మంలోని ఇందిరానగర్ హైస్కూల్‌లో ఎన్నికల నమోదు అధికారి రాజ్‌కుమార్, సూపర్‌వైజర్ దివ్య ఆధ్వర్యంలో నోటీసులు జారీ అయిన ఓటర్లకు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 250 మంది ఓటర్ల నుంచి సంబంధిత పత్రాలను స్వీకరించి వారి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితాలో పేరు, వయస్సు, ఫొటో తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిర్ణీత సమయంలో సవరణలు చేసుకోవాలని సూచించారు. చిరునామా మారిన వారు కూడా తమ ఓటరు వివరాలను నవీకరించుకోవచ్చన్నారు. ప్రతి ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును ప్రతి అర్హుడు బాధ్యతాయుతంగా వినియోగించుకునేలా నమోదు చేసుకోవాలని కోరారు

Original source: prabhanews.com
Read more on Kaizer News