Kaizer News

Guntur: గుంటూరు నగర ప్రజలకు సురక్షితమైన తాగునీరు

Guntur: గుంటూరు నగర ప్రజలకు సురక్షితమైన తాగునీరు

· State - Telangana · hmtvlive.com

Shorts గుంటూరు: గుంటూరు నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచడమే కాకుండా, విలీన గ్రామాలు, తాగునీటి సదుపాయం లేని ప్రాంతాల్లో నీటి ఎద్దడిని తీర్చేందుకు అమృత్ 2.0, యుఎఫ్ఐడీ పథకాల ద్వారా నీటి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి గుంటూరు నగర పాలక సంస్థ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం నగరంలో 150.20 మిలియన్ లీటర్లు (ఎంఎల్డీ) నీటిని ప్రతిరోజూ శుద్ధి చేసే సామర్థ్యంతో 4 ఫిల్ట్రేషన్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా 135.50 ఎంఎల్డీ నీటిని శుద్ధి చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. నగరవ్యాప్తంగా నీటి సరఫరా కోసం 96 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్ లైన్ మరియు 1013 కిలోమీటర్ల విస్తీర్ణంలో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ అందుబాటులో ఉందని, 52,058 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన 41 సర్వీస్ రిజర్వాయర్లను వినియోగిస్తున్నామని, మరో 3 ప్రాంతాల్లో నూతన రిజిర్వాయర్ల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. నగరంలోని మొత్తం 2,15,298 ఆస్తులకు గానూ, ఇప్పటివరకు 1,54,825 కుళాయి కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు జిటి రోడ్డులోని 'ఐపిఎం ల్యాబ్', తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ లోని 'యూఎల్బీ ల్యాబ్' ద్వారా నిరంతరం టర్బిడిటీ, పిహెచ్, క్లోరిన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే ఒక్కో వార్డు సచివాలయం పరిధిలో ఎమినిటి కార్యదర్శులు రోజుకు 10 శాంపిల్స్ చొప్పున రెసిడ్యూయల్ క్లోరిన్ పరీక్షలతో పాటు హెడ్ వాటర్ వర్క్స్ లో ప్రతి వారం 21 హెచ్2ఎస్ స్ట్రిప్స్ శాంపిల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాటర్ వర్క్స్ వద్ద 2.0 పిపిఏం, నెట్‌వర్క్ చివరి పాయింట్ వరకు 0.2 పిపిఎం క్లోరినేషన్ నమోదు అయ్యేలా పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా, ప్రతి నెల రిజర్వాయర్లను శుభ్రం చేసి తేదీలతో సహా బోర్డులపై ప్రదర్శిస్తూ, లీకేజీలను తక్షణమే అరికడుతున్నామన్నారు. రెడ్డిపాలెం, మదర్ థెరిస్సా నగర్, ప్రశాంతి నగర్, గోరంట్ల, మేరీప్రియ నగర్, ప్రగతి నగర్, చౌడరం, పెదపలకలూరు, అడవితక్కెళ్లపాడు, నల్లపాడు, అంకిరెడ్డిపాలెం, పొత్తూరు, ఏటుకూరు, బుడంపాడు, నగరాలు ప్రాంతాల్లోని 1.35 లక్షల జనాభాకు అదనంగా 25 ఎంఎల్డీ నీటి అవసరం ఉందని, ఈ ప్రాంతాల కోసం యూఎఫ్ఐడీ ఫేజ్ I & II పనులను పునఃప్రారంభించడంతో పాటు, అమృత్ 2.0 పథకం ద్వారా నీటి వనరుల పెంపు మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ విస్తరణ పనులను వేగవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News