Kaizer News

Sikh Driver | యూకేలో భార‌త సంత‌తి వ్య‌క్తిపై యెమెన

Sikh Driver | యూకేలో భార‌త సంత‌తి వ్య‌క్తిపై యెమెన్ జాతీయుడి దాడి..!

· National - India · ntnews.com

Sikh Driver : యూకే (UK) లో భారత సంతతికి చెందిన సిక్కు బస్సు డ్రైవర్‌ (Sick Bus Driver) పై అమానుష దాడి జరిగింది. 33 ఏళ్ల యెమెన్ (Yemen) జాతీయుడు సిక్కు డ్రైవర్‌పై దాడిచేసి అతని బస్సును దొంగిలించాడు. ఆ బ‌స్సును రాంగ్ రూట్‌లో నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం టెల్ఫోర్డ్‌లోని మేడ్లీ ప్రాంతంలో ఉన్న కోర్ట్ స్ట్రీట్‌లో చోటుచేసుకుంది. ఈ దాడి మొత్తం కెమెరాలో రికార్డ్ అవ్వగా, ఆ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. అలీ బల్హాద్ అనే యెమెన్ జాతీయుడు సిక్కు డ్రైవర్ గడ్డాన్ని పట్టుకుని లాగడం, అతని తలతో డ్రైవర్ తలను బలంగా బాదడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక మహిళ.. “అతడిని ఎందుకు అలా కొడుతున్నావ్..?” అని అడగటం కూడా వీడియోలో వినిపించింది. బాధితుడైన డ్రైవర్.. “దయచేసి పోలీసులకు ఫోన్ చేయండి. ఈ వ్యక్తిని నా దగ్గరి నుంచి తీసుకుపోండి” అని ఆమెను వేడుకున్నాడు. అయినా ఆగని నిందితుడు, బస్సులోని కొన్ని భాగాలను ధ్వంసం చేశాడు. బస్సు క్యాబిన్‌లోని ఒక లైట్‌ను బయటకు లాగి.. దానితో డ్రైవర్‌పై దాడి చేస్తానని బెదిరించాడు. బస్సును తనకు ఇచ్చేయాలని పదేపదే డిమాండ్ చేశాడు. దాదాపు నిమిషంపాటు ఈ దాడి కొనసాగింది. చివరకు నిందితుడు బల్హాద్ డ్రైవర్‌ను బలవంతంగా బస్సులో నుంచి కిందకు తోసేసి, స్టీరింగ్ ఎక్కాడు. ఆ తర్వాత బస్సును రాంగ్ రూట్‌లో పార్క్ వే నుంచి హై స్ట్రీట్ వైపు వేగంగా నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. ఆ సమయంలో ఒక మహిళ ‘ఓ మై గాడ్’ అని అరుస్తూ.. పక్కకు జరగమని ప్రజలను హెచ్చరిస్తూ బస్సు వెనుక పరిగెత్తడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై సాయంత్రం 6:37 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న 10 నిమిషాల్లోనే వెస్ట్ మెర్సియా పోలీసులు, సాయుధ బలగాలతో సహా ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బస్సును నిలిపివేసి.. దోపిడీ, ప్రమాదకరంగా వాహనం నడపడం వంటి ఆరోపణలపై అలీ బల్హాద్‌ను అరెస్ట్ చేశారు. ఈ దాడిలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని, వేరే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే మా అధికారులు స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. డిటెక్టివ్ సార్జెంట్ తైగ్ లానీ మాట్లాడుతూ.. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించిందని, అయితే పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఘటనను చూసిన వారు లేదా తమ వద్ద డాష్‌క్యామ్, సీసీటీవీ ఫుటేజ్ ఉన్నవారు దర్యాప్తుకు సహకరించాలని పోలీసులు కోరారు. గత వారం రోజులుగా టెల్ఫోర్డ్ ప్రాంతంలోనే ఉంటున్నట్లు భావిస్తున్న నిందితుడు అలీ బల్హాద్‌పై పోలీసులు తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News