నర్సాపురం, ఆంధ్రప్రభ: స్థానిక శ్రీ వై.ఎన్. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘తెలుగు వెలుగు’ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు విశ్రాంత వాణిజ్య శాఖాధ్యక్షులు వాడ్రేవు సుందర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘భారత స్వాతంత్య్రోద్యమం–తెలుగు నాటకాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రజలను చైతన్యపరచడంలో, దేశభక్తిని పెంపొందించడంలో తెలుగు నాటక రంగం కీలక పాత్ర పోషించిందన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొంటూ పలువురు రచయితలు దేశభక్తి, స్వాతంత్య్ర కాంక్షను ప్రతిబింబించే నాటకాలను రచించారని వివరించారు. సోమరాజు రామానుజరావు రచించిన ‘తిలక్ రాయబారం’, ‘స్వరాజ్య రథం’ వంటి నాటకాలు స్వాతంత్య్ర కాంక్ష, మత సామరస్యం, దేశభక్తి, శాంతి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాయని తెలిపారు. ‘తిలక్ రాయబారం’కు విశేష ఆదరణ లభించడంతో దానిని విస్తరించి ‘స్వరాజ్య రథం’గా రూపొందించినట్లు వివరించారు. ఈ నాటకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1922 జూన్ 26న జీవో నంబర్ 466 ద్వారా నిషేధించిందని పేర్కొన్నారు. దామరాజు పుండరీకాక్షుడు రచించిన ‘పాంచాల పరాభవం’, ‘నవయుగం’ వంటి నాటకాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, రచయితలు చారిత్రక ఘటనలను స్వాతంత్య్ర స్ఫూర్తికి ప్రతీకలుగా మలిచి నాటకాలను ప్రదర్శించేవారని తెలిపారు. బ్రిటిష్ పాలకులను నేరుగా విమర్శిస్తే శిక్షలు ఎదురయ్యే పరిస్థితుల్లో పురాణాల్లోని రాక్షస పాత్రలను బ్రిటిష్ పాలకులతో పోలుస్తూ రూపక నాటకాలు రూపొందించేవారని చెప్పారు. ఆ నాటకాల్లోని దేశభక్తి గీతాలు ప్రజల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయని, నాటక ప్రదర్శనల ద్వారా ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమంపై చైతన్యం పెరిగిందన్నారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ‘డ్రమాటిక్ పర్ఫార్మెన్సెస్ యాక్ట్’ ద్వారా నాటకాలను, వాటి ప్రదర్శనలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు పోలిశెట్టి శ్రీ రఘురామారావు, కార్యదర్శి, కరస్పాండెంట్ డాక్టర్ అందే రామ్ సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏపీ.వి. అప్పారావు, ఉప ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఆర్.బి. వరలక్ష్మి, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ గంధం శ్రీరామకృష్ణ, హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ డాక్టర్ చినమిల్లి శ్రీనివాస్, తెలుగు శాఖాధ్యక్షులు ఎస్. యాకోబు, తెలుగు అధ్యాపకురాలు ఎస్. చంద్రకళ, బీఈడీ ప్రిన్సిపాల్ పి. శాంతి, అధ్యాపకులు కళ్యాణ్, పరమేశ్వరి, నీలిమ, అమ్మాజీ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు