హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘చేయూత’ పింఛన్ల పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగింపు దశకు చేరింది. దరఖాస్తుల నమోదుకు నేడు ఆఖరు కావడంతో క్షేత్రస్థాయిలో డేటా ఎంట్రీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. శనివారం సాయంత్రం వరకు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని సెర్ప్ రూపొందించిన అధికారిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి మొత్తం 4,34,854 దరఖాస్తులు నమోదయ్యాయి. గడువు ముగుస్తుండటంతో అర్హులైన పేదలు చివరి నిమిషంలో గ్రామ పంచాయతీలు, వార్డు సచివాలయాలు, ప్రజాపాలన సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 4.34 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో అత్యధికంగా వితంతు పింఛన్లు కోసం 2,64,815 మంది (సుమారు 61 శాతం) దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగుల పింఛన్లు కోసం 1,07,171 మంది అప్లై చేసుకున్నారు. ఒంటరి మహిళలు పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 26,057 మంది దరఖాస్తు చేసుకున్నారు. గీత కార్మికులు 26,343 మంది దరఖాస్తులు సమర్పించారు. చేనేత కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా 10,468 మంది నమోదు చేసుకున్నారు