నూతన్‌కల్, మద్దిరాల మండలాల్లో 9 గ్రామాల రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి సూర్యాపేట, ఆంధ్రప్రభ : దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతుల చేతికి పట్టాదారు పాస్‌బుక్‌లు అందించడం ఆనందంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్‌కల్‌లో సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నూతన్‌కల్, మద్దిరాల మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాలతో హక్కును, ఇందిరమ్మ ఇళ్లతో ఆత్మగౌరవాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ అప్పుల భారం ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో రూ.36 వేల కోట్లతో రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎర్రపహాడ్ ఎక్స్‌రోడ్ నుంచి దంతాలపల్లి వరకు రూ.96 కోట్లతో రహదారి పనులకు టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చూపించే ప్రభుత్వమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. రూ.20 వేల కోట్ల రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ అప్పులకు అసలు, వడ్డీలు చెల్లిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని అన్నారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా, రాకపోయినా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు