Kaizer News

ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు..

ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు..

· State - Telangana · prabhanews.com

పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. రైతులతో కలిసి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను 100 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి చాలా కాలం గడిచినా సమస్యలు పరిష్కరించలేదని బీఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులు చేపట్టే పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మహిళలు, విద్యార్థులు, యువకులు, రైతులు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారని, వాటి అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపు, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు, సప్లిమెంటరీ బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు, డీఏ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల బదిలీలు, ఇతర సమస్యల పరిష్కారంపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టే భవిష్యత్ పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని, అవసరమైతే ప్రత్యక్షంగా పాల్గొంటామని నాగం శశిధర్ రెడ్డి తెలిపారు. ఆశా కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, రైతులు, కౌలు రైతులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చలు జరిపినట్లు ప్రకటనలు చేశారని, ఆ సమావేశాల ఎజెండా, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏదుల రిజర్వాయర్ నుంచి పాలమూరు-రంగారెడ్డి పథకానికి గండికొట్టి ఇతర ప్రాజెక్టులకు నీటిని మళ్లించే చర్యలను సహించబోమని నాగం శశిధర్ రెడ్డి అన్నారు. రైతులకు నష్టం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలా గౌడ్, కౌన్సిలర్ అర్జునయ్య, భీముడు, సత్యం, అహ్మద్, వెంకటస్వామి, దామోదర్, విష్ణుచారి, మూలింటి వెంకటేశ్వర్లు, ప్రవీణ్ చారి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News