ఒక్క సీటు కూడా ఖరారు కాలేదు.. తుది నిర్ణయం పవన్ కల్యాణ్‌దే Janasena | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక విషయాలు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క స్థానానికి కూడా టికెట్ ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. ఇవాళ విశాఖపట్నంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టికెట్ల కేటాయింపుపై ప్రస్తుతం సమన్వయ కమిటీ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీసుకుంటారని వెల్లడించారు. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పార్టీకి సంబంధించి వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామనే అంశం కంటే, గెలిచే సామర్థ్యం ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బలమైన అభ్యర్థుల ఎంపిక, సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో ముందుకు సాగాలని తెలిపారు. కూటమి భాగస్వామ్యం వల్లే ఏపీలో ఈ స్థాయికి చేరుకోగలిగామని.. మూడు పార్టీలు బలంగా ఉన్నాయని తెలిపారు