స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శ్రమదానం చేసిన కలెక్టర్ డీకే బాలాజి కార్యక్రమానికి సైకిల్‌పై హాజరైన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, ఆంధ్రప్రభ : పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి, పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం నగరంలోని పాత రైల్వే స్టేషన్ వద్ద నూతన మున్సిపల్ కార్యాలయ భవన ప్రాంగణంలో ప్రత్యేక పారిశుధ్య, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు ప్రాధాన్యతను చాటిచెప్పేలా కలెక్టర్ తన బంగ్లా నుంచి కార్యక్రమం జరిగే ప్రాంతానికి సైకిల్‌పై వచ్చారు. కార్యక్రమంలో అందరి చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, పారిశుధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణను ప్రజల నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వివిఎస్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ కె. నాగరాజు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అడపా సుబ్రహ్మణ్యం, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి జయరావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, ఐసిడిఎస్ పిడి ఐ విమల, కలెక్టరేట్ ఏవో రాధిక తదితర శాఖల అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు, ఇతర మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు