నీటిని పొదుపుగా వినియోగిస్తూ అధిక దిగుబడులు సాధించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, ఆంధ్రప్రభ : వరి సాగులో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి నీటిని సమర్థంగా ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సాంప్రదాయ సాగు పద్ధతుల నుంచి రైతులు ఆధునిక విధానాల వైపు మారాలని, తక్కువ వనరులతో అధిక దిగుబడులు సాధించేలా నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు. పెద్దపల్లి రంగంపల్లి వెంకటపద్మ ఫంక్షన్‌హాల్‌లో శనివారం సో రీప్ క్లైమాటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వరి వరహాలు’ కార్యక్రమంలో వరి సాగులో నీటిని సమర్థంగా వినియోగించిన రైతులకు ఎకరాకు రూ.500 చొప్పున ప్రోత్సాహక చెక్కులను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాగు విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. పాత పద్ధతులనే కొనసాగించడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించడం కష్టమని, శాస్త్రీయ విధానాలను పాటిస్తూ తక్కువ వనరులతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. అధిక ఉత్పత్తితో పాటు నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చి ప్రపంచ మార్కెట్‌తో పోటీపడే స్థాయికి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకెళ్లాలని అన్నారు. కరీంనగర్ ప్రాంతంలో సుమారు 60 వేల ఎకరాల్లో రైతులను సాంప్రదాయ వరి సాగు నుంచి ఆధునిక పద్ధతుల వైపు మళ్లించేందుకు సో రీప్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న పాత పద్ధతుల నుంచి రైతులను నూతన విధానాల వైపు మళ్లించడం అంత సులభం కాదని, ఈ స్థాయిలో మార్పు తీసుకురావడం అభినందనీయమన్నారు. వరి సాగులో నీటిని సమర్థంగా వినియోగించడం ద్వారా వృథాను అరికట్టడంతో పాటు పంటకు అవసరమైన సమయంలో తగిన మోతాదులో నీటిని అందించి మెరుగైన దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. శాస్త్రీయ సాగు విధానాలను పాటించడం ద్వారా దిగుబడులు పెంచడంతో పాటు చీడపీడలను నియంత్రించవచ్చన్నారు. ఆధునిక సాగు పద్ధతులతో విజయవంతమైన రైతులు తమ అనుభవాలను చుట్టుపక్కల రైతులతో పంచుకోవాలని కోరారు. ఒక రైతు సాధించిన విజయం మరెందరో రైతులకు స్ఫూర్తిగా నిలవాలని, విజయవంతమైన సాగు విధానాలను విస్తృతంగా ప్రచారం చేసి ఇతర రైతులు కూడా వాటిని అనుసరించేలా చూడాలని సూచించారు. రైతులకు ఆధునిక సాంకేతిక పద్ధతులపై విస్తృత అవగాహన కల్పిస్తూ నీటి పొదుపు, శాస్త్రీయ సాగు, అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తుల సాధన దిశగా వ్యవసాయ శాఖ, సంబంధిత సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, ఏడీ కంఠయ్య, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనాథ్, ఆర్డీఓ కార్యాలయం ఏఓ తూము రవీందర్ పటేల్, హైకోర్టు అడ్వకేట్, యువ జనతా ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్ధార్తి నవీన్, ఎంఏఓ నాగార్జున, స్వచ్ఛంద సంస్థ సీఓఓ ఎన్. మురళీధర్, డైరెక్టర్ డి. దివ్యారెడ్డి, ఆపరేషన్స్ మేనేజర్ సీహెచ్. వెంకటరమణ, ఎన్‌బీఎస్ హెడ్ పృథ్వీరామ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి. స్వప్నతో పాటు సంస్థ బృందం, రైతులు పాల్గొన్నారు