Kaizer News

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు డేట్ ఫిక్స్ !

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు డేట్ ఫిక్స్ !

· State - Telangana · prabhanews.com

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో బైపీసీ (బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) విద్యార్థులకు ఎదురుచూస్తున్న ఈఏపీసెట్‌-2026 ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఫార్మసీ, ఫార్మ్‌-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. తొలి విడతలో సెప్టెంబర్‌ 12 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్‌ 21లోపు సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించనున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు సెప్టెంబర్‌ 12 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక వివరాల నమోదు, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ పూర్తి చేసుకోవాలి. సెప్టెంబర్‌ 15 నుంచి 17 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. పరిశీలన పూర్తైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 16 నుంచి 18 వరకు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సుల ఎంపికలను నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 18న ఎంపికలను ఖరారు చేయాల్సి ఉంటుంది. తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులకు సెప్టెంబర్‌ 21లోపు తాత్కాలిక సీట్ల కేటాయింపు ప్రకటిస్తారు. సీటు పొందిన వారు సెప్టెంబర్‌ 21, 22 తేదీల్లో ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో స్వీయ నివేదిక ప్రక్రియను పూర్తి చేయాలి. తొలి విడతలో సీటు రాని వారు లేదా కౌన్సెలింగ్‌కు హాజరు కాని అభ్యర్థుల కోసం తుది విడత నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 25న వివరాల నమోదు, ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ ఉంటుంది. సెప్టెంబర్‌ 26న ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. అదే రోజు నుంచి సెప్టెంబర్‌ 27 వరకు కళాశాలలు, కోర్సుల ఎంపికలకు అవకాశం ఉంటుంది. తొలి విడతలో ఇచ్చిన ఎంపికలు తుది విడతలో పరిగణనలోకి రావని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి అభ్యర్థులు కొత్తగా ఎంపికలను నమోదు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 27న ఎంపికలను ఖరారు చేయాలి. తుది విడత సీట్ల కేటాయింపును సెప్టెంబర్‌ 29లోపు ప్రకటిస్తారు. సీట్లు పొందిన వారు సెప్టెంబర్‌ 29, 30 తేదీల్లో ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ స్వీయ నివేదిక పూర్తి చేయాలి. అనంతరం సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 1 మధ్య కేటాయించిన కళాశాలలో నేరుగా హాజరై చేరిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కళాశాల, కోర్సు ఎంపికల సమయంలో అభ్యర్థులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచించారు. మెరుగైన అవకాశాల కోసం వీలైనన్ని ఎక్కువ ఎంపికలను నమోదు చేయాలని పేర్కొన్నారు. కళాశాలలో చేరే సమయంలో ధ్రువపత్రాల ప్రతులతో పాటు అసలు బదిలీ ధ్రువపత్రాన్ని సమర్పించి, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను అక్టోబర్‌ 2లోపు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News