కొండపల్లి అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన కేసులో 18 మంది నిర్దోషులు విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : అక్రమ కేసులు ఎక్కువ కాలం నిలవవని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించినందుకు నాటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో నమోదు చేసిన కేసులో దేవినేని ఉమాతో పాటు 18 మంది టీడీపీ నాయకులను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో హత్యాయత్నం, అల్లర్లు, దాడి, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం తదితర తీవ్ర సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల చట్టంలోని సెక్షన్లను కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో దేవినేని ఉమాను 12 రోజులకు పైగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో నిర్బంధించారు. మచిలీపట్నంలోని 10వ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ కొండపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించినందుకు తమపై దాడి చేసి, తిరిగి తమపైనే అక్రమ కేసులు పెట్టారని అన్నారు. న్యాయం కోసం తాము పోరాడామని, న్యాయస్థానం తీర్పుతో నిజం బయటపడిందని పేర్కొన్నారు. అక్రమ కేసులు ఎక్కువ కాలం నిలవవని మరోసారి తేలిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని దేవినేని ఉమా ఆరోపించారు. తనపై సైతం సుమారు 90 కేసులు పెట్టారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైలులో నిర్బంధించి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని విమర్శించారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించినందుకు తమపై కేసులు పెట్టారని, మరోవైపు వైసీపీ నేతలు అవినీతి కేసుల్లో కోర్టుకు హాజరుకాకుండా డిశ్చార్జి పిటిషన్లతో కాలం వెళ్లదీస్తున్నారని దేవినేని ఉమా అన్నారు. ప్రజల కోసం పోరాడిన తమపై పెట్టిన కేసులు నేడు న్యాయస్థానాల్లో నిలబడలేదని, న్యాయం, ధర్మం గెలిచాయని పేర్కొన్నారు