Kaizer News

45 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్షల రాసి.. 500కు 410

45 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్షల రాసి.. 500కు 410 మార్కులతో సత్తా చాటిన మహిళ!

· National - India · tv9telugu.com

జమ్మూలోని రూప్ నగర్‌కు చెందిన రేణు హన్స్ 2002లో పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే అనూహ్యంగా గణితంలో ఫెయిల్ కావడంతో ఆమె చదువు అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత వివాహం, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం వంటి కారణాలతో విద్యను కొనసాగించే అవకాశం లేకపోయింది. అయినప్పటికీ పదో తరగతి పూర్తి చేయాలన్న కోరిక మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. సంవత్సరాలు గడిచినా ఆ కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదల కొనసాగింది. రేణు కలను నిజం చేసేందుకు ఆమె కుమారుడు నమన్ కౌల్ ముందుకొచ్చాడు. 12వ తరగతి చదువుతున్న నమన్‌కు సంజ్ఞా భాషపై మంచి పట్టు ఉండటంతో తల్లికి గురువుగా మారాడు. పాఠశాల ముగిసిన తర్వాత సాయంత్రం వేళల్లో తన తల్లికి సంజ్ఞా భాష ద్వారా పాఠాలు బోధించేవాడు. ముఖ్యంగా గణితం, సైన్స్‌లోని క్లిష్టమైన భావనలను రేణుకు అర్థమయ్యేలా వివరించడం అతనికి సవాలుగా మారింది. అయితే తల్లి పట్టుదల, కుమారుడి సహకారంతో ఆమె పరీక్షకు సిద్ధమయ్యారు. రేణు గత ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు తనకంటే చిన్న, పెద్ద వయసుల విద్యార్థులను చూసి తొలుత కొంత సంకోచానికి గురయ్యారు. అయితే కుమారుడి ప్రోత్సాహంతో ధైర్యంగా పరీక్షలు రాశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో రేణు 500 మార్కులకు 410 మార్కులు, అంటే 82 శాతం సాధించారు. ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి తన చిరకాల కలను సాకారం చేసుకున్నారు. తన విజయంపై రేణు హన్స్ ఆనందం వ్యక్తం చేశారు. “ఈరోజు నా కల నిజమైంది. ఇదంతా నా కొడుకు వల్లే సాధ్యమైంది” అని పేర్కొన్నారు. చదువును మధ్యలో ఆపాల్సి వచ్చినా, ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి పరీక్ష రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం ద్వారా రేణు హన్స్ పట్టుదలతో ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని చాటిచెప్పారు. ఆమె ప్రయాణంలో కుమారుడు నమన్ అందించిన సహకారం కూడా ప్రత్యేకంగా నిలిచింది

Original source: tv9telugu.com
Read more on Kaizer News