హైకోర్టు తీర్పు ఆయనకు చెంపపెట్టు మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : పాలన చేతగాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు సూత్రధారి అయిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎల్ నినో ప్రభావంతో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నా, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీరు ఇచ్చి కేసీఆర్‌కు పేరు వస్తుందనే భేషజంతో ప్రభుత్వం పంప్ ఆన్ చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ లాగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంలో రేవంత్ విఫలమయ్యారని అన్నారు. దానం నాగేందర్ పై వేటు విషయం చర్చకు రాకుండా ఉండేందుకే కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్ కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని, కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలన చేతకాకపోతే సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ డిమాండ్ చేశారు