POCSO | గాంధీచౌక్, సిరిసిల్ల ఆగస్టు 31 : మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు యాటెల్లి విజయ్‌కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తంగళ్లపల్లికి చెందిన మైనర్ బాలిక 2021 నవంబర్ 24న ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లి తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాలికను నిందితుడు యాటెల్లి విజయ్ అపహరించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించి, కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. అనంతరం పోలీసులు బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సేకరించి నిందితుడిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసు సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు మానిటరింగ్ పోలీస్ ఎస్‌ఐలు నాయుడు, శ్రవణ్, కానిస్టేబుళ్లు రాజేందర్, నవీన్, వెన్నెలను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే అభినందించారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని, ఇలాంటి ఘటనలపై బాధిత కుటుంబాలు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ మహేష్ బీ గితే సూచించారు