Kaizer News

బోనాల పండుగలో కాలుష్యంపై అవగాహన…

బోనాల పండుగలో కాలుష్యంపై అవగాహన…

· State - Telangana · prabhanews.com

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన గ్రామదేవతల బోనాల పండుగ సందర్భంగా కాలుష్య విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పండుగకు వచ్చిన భక్తులు, ప్రజల్లో కాలుష్య తీవ్రతపై చైతన్యం కల్పించేందుకు ఫ్లెక్సీలు, ప్రచార ఫలకాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల వల్ల గాలి, నీరు, నేల కాలుష్యానికి గురవుతున్నాయంటూ సమితి ప్రతినిధులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండళ్ల తనిఖీ నివేదికల్లో పేర్కొన్న అంశాలను ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు చూపించారు. బెంజీన్, టోలుఈన్, డైక్లోరోమీథేన్, అసిటోన్, డైమిథైల్ ఫార్మమైడ్ వంటి రసాయనాల ఉనికిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాలుష్య పరిస్థితులు ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ, సంబంధిత అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాలుష్యం కారణంగా భవిష్యత్తులో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సమితి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామంలో వేడుకలకు వచ్చిన పలువురు ఫ్లెక్సీలను పరిశీలించి కాలుష్య సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్రమైన పండుగ వాతావరణంలో ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని విముక్తి పోరాట సమితి ప్రతినిధులు తెలిపారు. కాలుష్య రహిత గ్రామం కోసం ప్రజలంతా ఏకమై కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సమస్యను గుర్తించి ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాలుష్యకారక పరిశ్రమలపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య విముక్తి పోరాట సమితి ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, కాలుష్య నియంత్రణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. గ్రామాల పర్యావరణం, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News