Kaizer News

శాస్త్రోక్తంగా ముగిసిన పవిత్రోత్సవాలు

శాస్త్రోక్తంగా ముగిసిన పవిత్రోత్సవాలు

· State - Telangana · prabhanews.com

ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహా పూర్ణాహుతి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ముగింపు క్రతువులు పవిత్ర మార్జనంతో పరిసమాప్తి.. లోకకల్యాణం కోసం ప్రత్యేక పూజలు ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర వార్షిక పవిత్రోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా కొండపైని పాత యాగశాలలో మహా పూర్ణాహుతి, పవిత్ర మార్జన కార్యక్రమాలను వైదిక సంప్రదాయానుసారం వైభవంగా నిర్వహించారు. శనివారం ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితుల ఆధ్వర్యంలో ముగింపు క్రతువులు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ యజ్ఞ పరిసమాప్తికి సూచికగా మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం యాగశాలలో పూజించిన పవిత్ర జలాలతో దేవతామూర్తులకు, ఆలయ ప్రాంగణానికి సంప్రోక్షణ చేసి శాంతి మార్జన, ఆశీర్వచన కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల నివారణతోపాటు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఆనవాయితీ ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహించినట్లు వైదిక కమిటీ తెలిపింది. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు వివిధ వైదిక క్రతువులు, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. మహా పూర్ణాహుతిలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు కోట ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, కోట రవికుమార్, వైదిక కమిటీ సభ్యుడు శ్రీధర్ శర్మ ఆశీర్వచనం అందజేశారు. తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. కార్యక్రమంలో దేవస్థాన ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు, వైదిక కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News