Kaizer News

యాదాద్రి: రేషన్ షాపుల్లోని దొడ్డు బియ్యం కథ కంచికి

యాదాద్రి: రేషన్ షాపుల్లోని దొడ్డు బియ్యం కథ కంచికి!

· State - Telangana · v6velugu.com

యాదాద్రి, వెలుగు : ఏడాదిన్నర తర్వాత రేషన్​ షాపుల్లోని దొడ్డు బియ్యం కథ ముగిసింది. కిలోకు రూ.14 నష్టంతో సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ ఆ బియ్యాన్ని వదిలించుకుంది. ఎట్టున్న బియ్యం అట్లనే తీసుకొని పోవాలన్న నిబంధనతో తెలంగాణ, ఆంధ్రకు చెందిన ఇద్దరు బిడ్డర్లు ఆ బియ్యాన్ని టెండర్​లో దక్కించుకున్నారు. రేషన్​ కార్డుదారులకు గతేడాది మార్చి వరకూ దొడ్డు బియ్యం పంపిణీ జరిగింది. ఏప్రిల్​ 2025 నుంచి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో యాదాద్రి జిల్లాలోని 515 రేషన్​ షాపుల్లో 774 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు అలానే ఉండిపోయాయి. రైతుల నుంచి వడ్ల కొనుగోలు, ట్రాన్స్​పోర్ట్​తో పాటు మరాడించిన చార్జీలు కలుపుకుంటే కిలో బియ్యానికి రూ. 36 అవుతోంది. అయితే ఈ బియ్యానికి రూ. 12 చొప్పున తగ్గించి ‘జెమ్​ పోర్టల్’ ద్వారా ఈ ఏడాది మొదట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దొడ్డు బియ్యాన్ని ఒకే లాట్​గా గ్లోబల్​ టెండర్లు పిలిచారు. కానీ గడువు ముగిసినా ఏ ఒక్కరూ బిడ్లు దాఖలు చేయలేదు. ఏడాదిన్నరగా నిల్వ ఉండడంతో బియ్యానికి పురుగు పడుతోంది. దీంతో బియ్యం వెయిట్​ కూడా తగ్గుతోంది. ఈ పరిణామంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​మరోసారి టెండర్లు పిలించి, ఆన్​లైన్​తో పాటు ఆఫ్​లైన్​లోనూ బిడ్లు దాఖలు చేయాలని ప్రకటనలు ఇచ్చింది. దీంతో సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్, ఏపీలోని నందిగామకు చెందిన ఇద్దరు వ్యాపారులు బియ్యం విలువలో 5 శాతం అమౌంట్​ఈఎండీ చెల్లించి టెండర్లలో పాల్గొన్నారు. నాలుగు ఎంఎల్​ఎస్​ పాయింట్లలోని బియ్యానికి టెండర్​ వేసిన కాంట్రాక్టర్​ కిలోకు రూ. 21.15 చొప్పున కోట్​ చేస్తూ బిడ్ దాఖలు చేశారు. ఒక ఎంఎల్​ఎస్​ పాయింట్​లోని బియ్యం కొనుగోలు కోసం కిలో రూ. 22.10 చొప్పున మరో కాంట్రాక్టర్​ బిడ్లు దాఖలు చేశారు. ఎంఎల్ఎస్​ పాయింట్ల పరిధిలోని రేషన్​ షాపుల్లో స్టాక్​ ఉన్న బియ్యంలో ఎలాంటి తరుగు ఉన్నా సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ బాధ్యత వహించదు. ఏడాదిన్నర కింద ఎన్ని క్వింటాళ్ల బియ్యం ఉన్నాయో అన్ని క్వింటాళ్ల బియ్యాన్ని టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు రేషన్​ డీలర్లు అప్పగించాల్సి ఉంటుంది. దీనివల్ల తమకు నష్టం కలుగుతుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 1.10 కోట్ల నష్టం... ఇతరులు ఎవరూ బిడ్లు దాఖలు చేయక పోవడంతో కిలోకు రూ. 14 నష్టం కలుగుతున్నా ఇద్దరి టెండర్లను సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ ఓకే చేసింది. దీంతో దాదాపు రూ1.10 కోట్ల నష్టం వాటిల్లనుంది. కాగా, ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు తాము దక్కించుకున్న బియ్యం విలువలో మరో 10 శాతం అమౌంట్​ సివిల్​ సప్లయ్​కు అడ్వాన్స్​గా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఎక్కడ ఉన్న బియ్యం ఎలా ఉన్నా అలానే తీసుకోవాల్సి ఉంటుంది. బియ్యం తీసుకోకపోతే ఈఎండీ, అడ్వాన్స్​గా చెల్లించిన అమౌంట్​ను డిపార్ట్​మెంట్​తిరిగి ఇవ్వదు

Original source: v6velugu.com
Read more on Kaizer News