తెలంగాణ ప్రజలు మొన్నటి వరకూ ఎండల బాధతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఎండాకాలంలో కంటే ఇటీవలి కాలంలోనే అధికంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే గత రెండు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న హైదరాబాద్ లో భీకర వర్షం కురిసిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడిన క్రమంలో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో ఈ నెల 27 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 21 ఉదయం 8 గంటల వరకు భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. ఈ నెల 23 నుంచి 26 వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 22 న కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అటు బుధవారం మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాల్లోని అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక గురువారం ఆసీఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అలాగే శుక్ర, శని వారాల్లోనూ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది