TG | మహబూబాబాద్, ఆంధ్రప్రభ : పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్‌పై టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు సమీపంలో విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, దాడి చేసిన ఘటనలో తొర్రూరు డిపోకు చెందిన బస్సు డ్రైవర్ స్వామి (స్టాఫ్ నం. 2047)ను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TS26T1266)లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో డ్రైవర్ స్వామి బాధ్యతారహితంగా, ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించినట్లు నిర్ధారణ కావడంతో యాజమాన్యం చర్యలు చేపట్టింది. ప్రయాణికుల భద్రత, గౌరవం సంస్థకు అత్యంత ముఖ్యమని టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. ఆర్టీసీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని యాజమాన్యం హెచ్చరించింది. ప్రయాణికులతో సౌమ్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించింది