కేసీఆర్ మీద కక్షతో ఎత్తిపోయకుండా కావాలనే తాత్సారం రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో మోగుతున్న ప్రమాద ఘంటికలు వట్టిపోతున్న రిజర్వాయర్లు.. సగానికిపైగా చెరువులు ఖాళీ అప్పుడు వదిలేసి, ఇప్పుడు నీళ్లు లేవని చేతులెత్తేస్తున్న సర్కార్ మబ్బుల్లో నీళ్లు చూసి, ముంత ఒలకబోసుకున్నట్టున్నది కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం. కాళేశ్వరం మీద కక్షతో వరద నీటిని ఒడిసిపట్టకుండా ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేసింది. ఒక్క మేడిగడ్డ నుంచే సుమారు 600 టీఎంసీల నీళ్లు దిగువకు వెళ్లిపోయాయి. ఇప్పుడు ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, ఉన్ననీటినీ సాగుకు పూర్తిగా ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నది. హైదరాబాద్, సెప్టెంబర్18 (నమస్తే తెలంగాణ) : గోదావరి జలాలను దిగువకు చేజేతులా కాంగ్రెస్ సర్కార్ జారవిడుస్తున్నది. కృష్ణాజలాలు యథేచ్ఛగా ఏపీ కొల్లగొడుతున్నది. ప్రధాన జలాశయాల్లో నీటినిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు సగానికి పైగా వెలవెలబోతున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. నీటి సంరక్షణపై రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాబోయే రోజుల్లో నీటిసంక్షోభం తలెత్తక తప్పదని అధికార వర్గాలే హెచ్చరిస్తున్నాయి. పట్టణాలు, పల్లెలని తేడాలేకుండా బోర్లు వట్టిపోతుండటంతో రానున్న కొన్నిరోజుల్లోనే తాగునీటికి కటకట ఏర్పడే ప్రమాదం ఉన్నదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఉంటాయని కేంద్ర, రాష్ట్ర వాతావరణ శాఖలు మార్చి నెలాఖరు నుంచే గుర్తుచేస్తున్నాయి. నివేదికలను విడుదల చేస్తూ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ వస్తున్నాయి. నీటి సంరక్షణపై దృష్టి సారించాలని సూచనలు చేస్తున్నాయి. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని పెడచెవిన పెట్టింది. గోదావరి జలాలను ఒడిసిపట్టుకొని పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిపోయి ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులను వినియోగించుకోకుండా పడావుగా పెడుతూ, తెలంగాణలోని సాగు భూములను ఎండబెట్టింది. స్వ‘హస్తాల’తో కరువు కోరల్లోకి తెలంగాణను నెట్టింది. ఈ ఏడాది ఇప్పటివరకు గోదావరిలోకి మొత్తంగా 1,045 టీఎంసీలు రాగా, అందులో ఒక్క ప్రాణహిత నుంచే దాదాపు 610 టీఎంసీలకు పైగా జలాలు దిగువకు తరలిపోయాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ ఎగువ కన్నెపల్లి పంపులను ఆన్‌చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసిపట్టుకొనే వెసులుబాటు తెలంగాణకు ఉన్నది. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అక్కడి నుంచి నందిమేడారం, లక్ష్మీపూర్, రాజరాజేశ్వర జలాశయం, అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్, రంగనాయకసాగర్‌కు, తద్వారా కొమురవెళ్లి మల్లన్నసాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు గోదావరి జలాలను తరలించుకోవచ్చు. అందుకు కావాల్సిన నీటిసరఫరా వ్యవస్థ మొత్త సంసిద్ధంగా ఉన్నది. అంతేకాదు ఎస్సారెస్సీ, నిజాంసాగర్‌ను సైతం నింపుకొనే అవకాశం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు రాడార్‌లోని దాదాపు 10 వేలకు పైగా చెరువులను నింపుకొనే సౌలభ్యమూ ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయనేలేదు. కావాల